Sun. Jul 5th, 2026

కార్పొరేట్ కంపెనీల్లో ఒక్కోసారి ఎదురయ్యే పరిణామాలు విస్తుపోయేలా చేస్తాయి. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన ఉద్యోగులను సైతం చిన్నచిన్న కారణాలతో నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఫోర్డ్’ (Ford) లో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా రూ.1.9 కోట్ల వార్షిక వేతనం తీసుకుంటున్న ఓ సీనియర్ ఉద్యోగిని, కేవలం 186 రూపాయల ($1.95) విలువైన బిస్కెట్ దొంగిలించాడనే నెపంతో కంపెనీ నుంచి గెంటేశారు.

కెంటకీలోని లూయిస్‌విల్లే ట్రక్ ప్లాంట్‌లో కర్ట్ క్రోమ్ (60) గత 11 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారానికి సగటున 60 గంటల పాటు శ్రమించే ఆయన.. గతేడాది సుమారు 2 లక్షల డాలర్లు (రూ. 1.9 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. ఓ రోజు షుగర్ లెవెల్స్ పడిపోయి నీరసంగా అనిపించడంతో, ఆఫీస్ క్యాంటీన్‌కు వెళ్లి గ్రాండ్మాస్ చాక్లెట్ చిప్ కుకీ తీసుకున్నారు. దానికి డబ్బులు చెల్లించకుండా దొంగతనంగా తిన్నాడంటూ క్యాంటీన్ సిబ్బంది ఆయనపై యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

వెంటనే ఫోర్డ్ మేనేజ్‌మెంట్ క్రోమ్‌ను ఆఫీస్ గదిలోకి పిలిపించింది. సీసీటీవీలో దొంగతనం రికార్డ్ అయిందని, క్షమాపణలు చెబితే వదిలేస్తామని.. లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని యూనియన్ ప్రతినిధులు హెచ్చరించారు. తాను తప్పు చేయలేదని, కుకీకి డబ్బులు చెల్లించానని ఆయన ఎంత మొత్తుకున్నా వారు వినలేదు. కనీసం ఆధారాలు చూపే అవకాశం కూడా ఇవ్వకుండా ఆయన్ను ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపేశారు.

అవాక్కైన యాజమాన్యం
ఉద్యోగం నుంచి తీసేసిన తర్వాత క్రోమ్ తన బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా.. కుకీ కొనుగోలుకు సంబంధించిన $1.95 డెబిట్ అయినట్లు అందులో కనిపించింది. వెంటనే ఆ స్క్రీన్ షాట్లను ఫోర్డ్ యాజమాన్యానికి పంపించారు. మొదట్లో ఆ బ్యాంకు స్టేట్‌మెంట్‌ను నమ్మడానికి కూడా కంపెనీ నిరాకరించింది. చివరకు రెండు వారాల తర్వాత, క్యాంటీన్ నిర్వహించే కియోస్క్ ఆపరేటర్ సైతం క్రోమ్ డబ్బులు చెల్లించినట్లు నిర్ధారించారు.

దీంతో తమ తప్పు తెలుసుకున్న ఫోర్డ్ సంస్థ.. మళ్లీ విధుల్లోకి చేరాలని క్రోమ్‌ను కోరింది. కానీ, తనను దొంగగా చిత్రీకరించి అవమానించిన కంపెనీకి తిరిగి వెళ్లకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. అప్పటికే ఇంటికి దగ్గర్లో, మునుపటి కంటే మెరుగైన ప్యాకేజీతో (గంటకు 52 డాలర్ల జీతం, బోనస్) మరో ఉద్యోగం తెచ్చుకుని పాత కంపెనీకి దిమ్మతిరిగే షాకిచ్చారు. “గతేడాది నేను క్యాంటీన్‌లోనే రూ. లక్షకు పైగా ఖర్చు చేశాను.. అలాంటిది నేను కేవలం 186 రూపాయల కోసం ఎందుకు దొంగతనం చేస్తాను?” అంటూ క్రోమ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

The publish వింత అనుభవం: రూ.186 బిస్కెట్ దొంగిలించాడని.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని పీకేసిన ఫోర్డ్ కంపెనీ! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.