Sun. Jul 5th, 2026
Kannappa : ‘కన్నప్ప’ శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి

Kannappa: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అయింది. గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా విడుదలై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో, ఇటీవల జూన్ 27న చిత్ర యూనిట్ ఈ సినిమాను థియేటర్లలో రీ-రిలీజ్ చేసింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘అవా ఎంటర్టైన్మెంట్’ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని ప్రముఖ భాషలైన తమిళ్, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేని సామాన్య ప్రేక్షకులకు కూడా ఈ సినిమాను వీక్షించే అవకాశం దక్కడంతో, యూట్యూబ్‌లో మంచి వ్యూస్ తెచ్చుకుంటుంది.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా. ఎం. మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ పౌరాణిక గాథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో అంతటి క్రేజ్ సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఇందులో నటించిన అగ్ర నటీనటులే. మోహన్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వంటి దిగ్గజాలు కీలక పాత్రల్లో మెరవడంతో ఈ సినిమా విజువల్ వండర్‌గా నిలిచింది. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు యూట్యూబ్‌లో ఈ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.