ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూన్ 12, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : అలీ ఫజల్, సోనాలీ బింద్రే, ఆమీర్ బషీర్, ఆకాష్ మఖిజా, రమణ్‌దీప్ యాదవ్ తదితరులు
దర్శకులు : ప్రోసిత్ రాయ్, అనూష నందకుమార్, సందీప్ సాకేత్
నిర్మాతలు : ఎండిమోల్ షైన్ ఇండియా, భడిపా
సంగీతం : అజయ్ జయంతి, పార్థ్ పాండ్య
ఛాయాగ్రహణం : సౌమ్య నంద సాహి
కూర్పు : మానస్ మిట్టల్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
అలీ ఫజల్ ప్రధాన పాత్రలో, సోనాలి బింద్రే కీలక పాత్రలో అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త క్రైమ్ సిరీస్ ‘రాఖ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలోకి వెళ్లి చూద్దాం.
కథ :
1970ల కాలంలో దేశాన్ని కుదిపేసిన ‘రంగా-బిల్లా’ కేసు ఆధారంగా ‘రాఖ్’ సిరీస్ తెరకెక్కింది. ఢిల్లీలో నివసించే ఒక ఆర్మీ ఆఫీసర్ పిల్లలు సుమన్ అరోరా(దివ్య శర్మ), సాహిల్ అరోరా(వివాన్ శర్మ). ఒక సాయంత్రం సుమన్ అరోరా రేడియో స్టేషన్‌లో పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉండటంతో ఇద్దరూ కలిసి ఇంటి నుండి బయలుదేరుతారు. అయితే, ఆ పిల్లలు రాత్రికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు (అమీర్ బషీర్, సోనాలి బింద్రే) పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ కేసును సబ్ ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్ జాతవ్ (అలీ ఫజల్) చేతుల్లోకి తీసుకుంటాడు. దర్యాప్తు ప్రారంభించిన కొద్దిసేపటికే ఆ పిల్లలు ఒక అడవిలో అత్యంత ఘోరంగా హత్యకు గురయ్యారని పోలీసులకు తెలుస్తుంది. బాబు (ఆకాష్ మఖిజా), రజ్జో (రమణ్‌దీప్ యాదవ్) అనే ఇద్దరు క్రిమినల్స్ ఈ దారుణానికి ఒడిగట్టారు. అసలు అమాయక పిల్లలను బాబు, రజ్జో ఎందుకు చంపాల్సి వచ్చింది? వారి గతం ఏమిటి? జయప్రకాష్ వారిని ఎలా పట్టుకున్నాడు? అనేదే ఈ సిరీస్ కథాంశం.
ప్లస్ పాయింట్స్ :
గతంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పాతాళ్ లోక్’ సిరీస్ దర్శకుడు ప్రోసిత్ రాయ్ ఈ ‘రాఖ్’ను తెరకెక్కించాడు. ‘పాతాళ్ లోక్’ నచ్చిన వారికి, ఈ సిరీస్ కూడా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఈ సిరీస్‌ను అంతటి ప్రతిభతో రూపొందించాడు. కేవలం దర్శకుడే కాకుండా, ఈ సిరీస్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ తమ అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.
సాధారణంగా క్రైమ్ సిరీస్‌లు లేదా సినిమాలు రెండు పద్ధతుల్లో సాగుతాయి. ఒకటి కిల్లర్స్ ఎవరో చివరి వరకు రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడం, రెండు మొదటి కొన్ని నిమిషాల్లోనే హంతకులు ఎవరో చూపించేయడం. ఇందులో రెండో పద్ధతిని స్క్రీన్‌ప్లేగా మార్చడం చాలా కష్టమైన పని.. కానీ రాఖ్ మేకర్స్ ఈ విషయంలో వంద శాతం విజయం సాధించారు. కథను కాస్త డ్రామాటైజ్ చేసినప్పటికీ, సిరీస్ ముగిసిన తర్వాత కూడా ఆ ఇంపాక్ట్ ప్రేక్షకుల మైండ్‌లోనే ఉండిపోతుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లే పద్ధతిని ఎంచుకోవడం వల్ల కథనంలో ఉత్కంఠ, ఆసక్తి బాగా పెరిగాయి. రాఖ్ సిరీస్ ఇంత బాగా వర్కవుట్ అవ్వడానికి కారణం కేవలం విలన్ల క్రూరత్వాన్ని చూపించడమే కాదు, అందులోని బలమైన ఎమోషనల్ డెప్త్ కూడా.
పోలీస్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్‌ను చాలా స్మార్ట్‌గా రాసుకున్నారు. విలన్ల సమాంతర కథనాలు ప్రేక్షకులను స్క్రీన్‌కు కట్టిపడేస్తాయి. హంతకులుగా నటించిన ఆకాష్ మఖిజా, రమణ్‌దీప్ యాదవ్ తమ పాత్రల్లోని క్రూరత్వాన్ని అద్భుతంగా పండించి బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. పట్టుదల గల పోలీస్ ఆఫీసర్‌గా అలీ ఫజల్ నటన అద్భుతంగా ఉంది. ఒక బాధితురాలైన తల్లిగా సోనాలి బింద్రే ఎమోషనల్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. దివ్య శర్మ, వివాన్ శర్మ తమ నటనతో కన్నీళ్లు పెట్టిస్తారు. అన్షుల్ చౌహాన్, రాకేష్ బేడి, సుధీర్ సాంగ్వాన్, ముకుంద్ పాల్ తదితరులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జరిగే అంతర్గత రాజకీయాలు, కొన్నిసార్లు ప్రొసీజర్స్ కఠినంగా పాటించడం వల్ల నేరస్థులు ఎలా తప్పించుకుంటారనే అంశాలను కూడా నీట్‌గా చూపించారు.
మైనస్ పాయింట్స్ :
నిజ జీవిత హంతకులు ఎంత క్రూరంగా, భయంకరంగా ఉండేవారో కళ్లకు కట్టినట్లు చూపించడానికి మేకర్స్ ఎక్కడా వెనకాడలేదు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు.
సిరీస్ ముగింపును నేరస్థులను పట్టుకోవడం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కాకుండా, పిల్లలకు సంబంధించిన ట్రాజెడీ దృశ్యాలతో ముగించడం అంతగా నచ్చకపోవచ్చు. ప్రేక్షకులు క్లైమాక్స్ కాస్త హై నోట్‌లో ఉంటుందని ఆశిస్తారు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు ప్రోసిత్ రాయ్ టేకింగ్ ప్రశంసనీయం. రైటింగ్ టీమ్ మరియు నటీనటుల నుండి ఆయన రాబట్టుకున్న అవుట్‌పుట్ వల్ల ‘పాతాళ్ లోక్’ రేంజ్ ఇంపాక్ట్‌ను ఈ సిరీస్‌తో కూడా డెలివరీ చేయగలిగారు. అజయ్ జయంతి, పార్థ్ పాండ్య అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్‌కు ప్రాణం పోసింది. సౌమ్యానంద సాహి సినిమాటోగ్రఫీ బ్రిలియంట్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా చాలా రిచ్‌గా ఉన్నాయి. 1970ల నాటి కాలానికి మమ్మల్ని తీసుకెళ్లడంలో ప్రొడక్షన్ డిజైన్ ఫస్ట్ క్లాస్ అనిపించుకుంటుంది. ఎడిటింగ్ చాలా వరకు సంతృప్తికరంగా ఉంది. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘రాఖ్’ చక్కటి స్క్రీన్‌ప్లే, నటీనటుల పర్ఫార్మెన్స్, గ్రిప్పింగ్ ట్రీట్‌మెంట్‌తో సాగే ఒక సాలిడ్ క్రైమ్ సిరీస్‌గా ప్రేక్షకులను మెప్పిస్తుంది. మొదటి రెండు ఎపిసోడ్‌లు కథను, పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి సమయం తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చే పోలీస్ ఇన్వెస్టిగేషన్, హంతకుల క్రూరత్వం, బలమైన ఎమోషన్స్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. హంతకులుగా ఆకాష్ మఖిజా, రమణ్‌దీప్ యాదవ్ నటన ఆకట్టుకుంది. అలీ ఫజల్, సోనాలి బింద్రే తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కొన్ని దృశ్యాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కాస్త ఇబ్బంది పెట్టవచ్చు, అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించడం మైనస్. క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారు ‘రాఖ్’ సిరీస్‌ను ట్రై చేయవచ్చు.
123telugu.com Score: 3.25/5
Reviewed via 123telugu Crew
Click on Right here For English Overview
The submit ఓటీటీ సమీక్ష : రాఖ్ – అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు డబ్బింగ్ సిరీస్ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
