Tom Cruise: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ అంటే ఇప్పటికీ యాక్షన్, స్టైలిష్ లుక్, ఫిట్‌నెస్‌కు ప్రతీకగా గుర్తుకొస్తారు. అయితే ఈసారి ఆయన అభిమానులు ఊహించని రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన ‘డిగ్గర్’ ట్రైలర్‌లో టామ్ క్రూజ్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముందుకు వచ్చిన పొట్ట, చెదిరిన జుట్టు, ముఖమంతా ముడతలతో కనిపించిన ఆయనను తొలిచూపులో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. ఈ విభిన్న గెటప్ ను చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఆస్కార్ విజేత అలెజాండ్రో జి. ఇనారిటు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిగ్గర్’ చిత్రంలో టామ్ క్రూజ్ బిలియనీర్ ఆయిల్ టైకూన్ డిగ్గర్ రాక్‌వెల్ పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్‌లో విలాసవంతమైన జీవితం గడిపే బిజినెస్ మ్యాన్ గా కనిపించిన ఆయన, తన కంపెనీ వల్ల సంభవించిన పర్యావరణ విపత్తు తర్వాత పూర్తిగా మారిపోయిన వ్యక్తిగా కనిపిస్తారు. కరుగుతున్న మంచు పర్వతాలు, ప్రకృతి విధ్వంసం, అణుయుద్ధ ముప్పు వంటి విజువల్స్‌తో ట్రైలర్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఉన్న డిగ్గర్, చివరికి రక్షకుడిగా మారే వ్యక్తగా ఈ కథలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ట్రైలర్‌లో కథ కంటే ఎక్కువగా ఆకట్టుకుంటున్న అంశం టామ్ క్రూజ్ మేకోవర్. ఇప్పటివరకు స్టైలిష్ హీరోగా కనిపించిన ఆయన, ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘డిగ్గర్’ ఒక బ్లాక్ కామెడీ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా విస్టావిజన్ ఫార్మాట్‌లో చిత్రీకరించడం విశేషం. దీంతో తెరపై ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతి అందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో టామ్ క్రూజ్‌తో పాటు ఆస్కార్ విజేత రిజ్ అహ్మద్, జాన్ గుడ్‌మాన్, ఆస్కార్ నామినీ సాండ్రా హల్లర్, మైఖేల్ స్టూల్‌బార్గ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ విడుదల చేసిన ఈ ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందన అందుకుంటుండగా, ‘డిగ్గర్’ చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
