Tue. Jul 14th, 2026
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’

Vijayashanthi: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘోర హత్యాకాండపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి సోషల్ మీడియా (ఫేస్‌బుక్) వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఉదంతంలో ప్రధాన నిందితుడు జైల్లో ఆత్మహత్య చేసుకోవడంతో కేసు ముగిసిపోయిందని పోలీసులు భావించడం సరికాదని ఆమె హితవు పలికారు. గతంలోనే ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో (POCSO) కేసులో అరెస్టయిన నిందితుడు రాజ్‌కుమార్.. అంత సులభంగా బెయిల్‌పై బయటకు రావడానికి స్థానిక పోలీసుల తీవ్ర నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. నిందితుడి వద్ద నుంచి లంచం తీసుకుని, కేసును నీరుగార్చి అతని విడుదలకు పోలీసులు సహకరించారనే వార్తలు పత్రికల ద్వారా తెలుసుకుని తెలంగాణలోని మహిళా లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రక్షించాల్సిన పోలీసులే చేసిన ఈ ఘోరమైన తప్పు వల్లే.. ఒకే కుటుంబానికి చెందిన అమాయకుల ప్రాణాలు దారుణంగా బలికావడానికి ఆస్కారం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆమె పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఉన్న ఇలాంటి లోపాలు, అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రతపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మహిళలకు పెద్దపీట వేస్తామని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షాబాద్ నరమేధాన్ని, దీని వెనుక ఉన్న పోలీస్ వైఫల్యాలను అత్యంత సీరియస్‌గా పరిగణించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడకుండా, బాధ్యులైన అధికారులపై కఠినంగా వ్యవహరించాలని ఒక మహిళా ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. హర హర మహాదేవ్, జై తెలంగాణ అని రాసి ఉన్న పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.