SS Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతి సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ వరల్డ్ విజయాల తర్వాత ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వినియోగిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘వారణాసి’ తర్వాత జక్కన్న ఎలాంటి సినిమా చేస్తారనే ఆసక్తిరమైన చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో మొదలైంది. ఇప్పటివరకు ప్రతి సినిమాతో స్కేల్‌ను పెంచుకుంటూ వచ్చిన రాజమౌళి .. వారణాసి తర్వాత అంతకంటే భారీ ప్రాజెక్ట్‌తో వస్తారా? లేదంటే గతంలో తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ తరహాలో చిన్న కథ, పరిమిత బడ్జెట్‌తో కూడిన సినిమాను ఎంచుకుంటారా? అనే ఆసక్తి సగటు ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గా్ల్లోనూ నెలకొంది.
సినీ వర్గాల అభిప్రాయం ప్రకారం.. ‘వారణాసి’ రిజల్ట్, అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ చిత్రానికి లభించే రెస్పాన్స్ ఆధారంగానే రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్కేల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తే, ఆయన మరోసారి మరింత భారీ విజన్‌తో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఒకవేళ కొంత గ్యాప్ అవసరమని ఆయన అనుకుంటే, చిన్న కాన్సెప్ట్‌తో, లో బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది.
