Wed. Jul 29th, 2026
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!

Michael Biopic OTT: మైఖేల్ జాక్సన్ మరణించి దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో తన స్థానం పదిలంగా నిలుపుకున్నారు. ప్రపంచ పాప్ సంగీతానికి కొత్త నిర్వచనం ఇచ్చిన మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘మైఖేల్’ బయోపిక్ 2026 ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో మైఖేల్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచింది. అతని రూపం, హావభావాలు, డ్యాన్స్ శైలి, స్టేజ్ ప్రెజెన్స్ మైఖేల్‌ను మరోసారి తెరపై చూసిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించాయని అభిమానులు ప్రశంసించారు. మూన్‌వాక్‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ పాప్ దిగ్గజం జీవితం ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేస్తోంది. థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన ‘మైఖేల్’ బయోపిక్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఎక్కడ చూడచ్చు అంటే?

థియేటర్ల ప్రదర్శన తర్వాత గత జూన్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, బుక్ మై షో వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమా రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్ట్ 29 నుంచి ఈ మూవీ హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా స్ట్రీమింగ్ కానుంది. అదనపు ఛార్జీలు చెల్లించకుండా సబ్ స్క్రిప్షన్ ఉంటే ఈ మూవీని ఇంట్లోనే ఎంచక్కా చూసేయచ్చు.

వసూళ్లలో రికార్డులు

థియేటర్లలో విడుదలైన వెంటనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.10,000 కోట్ల వసూళ్లు సాధించి, ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి హాలీవుడ్ బయోపిక్‌గా చరిత్ర సృష్టించింది. భారతదేశంలో కూడా ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.54 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసి, హాలీవుడ్ బయోపిక్‌లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

కథ

ఇందులో మైఖేల్ జాక్సన్ చిన్ననాటి నుంచి ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన స్టార్‌గా ఎదిగిన ప్రయాణాన్ని భావోద్వేగంగా చూపించారు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని గ్యారీ పట్టణంలో జన్మించిచారు మైఖేల్. తన సోదరులతో కలిసి ‘జాక్సన్ 5’ బ్యాండ్ ద్వారా సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు. చిన్న వయసులోనే తండ్రి జోసెఫ్ జాక్సన్ కఠిన వైఖరిని ఎదుర్కొన్న మైఖేల్ జీవితంలో ఎదురైన మానసిక వేదనలు, ఒంటరితనం, ప్రపంచ ఖ్యాతి వెనుక దాగిన బాధలను సినిమా హార్ట్ టచింగ్ గా చూపిస్తుంది.

ముఖ్యంగా ఆయన నిర్మించుకున్న నెవర్‌ల్యాండ్ వెనుక ఉన్న భావోద్వేగం, కోల్పోయిన బాల్యాన్ని తిరిగి పొందాలనే తపన, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలను ఈ బయోపిక్ కళ్ళకు కట్టినట్లు చూపించింది. థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారికి ఇది మంచి అవకాశం. సంగీతాన్ని ప్రేమించే వారైనా, మైఖేల్ జాక్సన్ అభిమానులైనా, ఒక గొప్ప కళాకారుడి జీవితం తెలుసుకోవాలనుకునే వారైనా జియో హాట్‌స్టార్‌లో ఈ బయోపిక్‌ను ఆస్వాదించవచ్చు.