Pavala Shyamala: తెలుగు రంగస్థల, సినీ నటి పావలా శ్యామల 74 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రంగస్థలం నుంచి వెండితెర వరకు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె మరణం సినీ, నాటక రంగాల్లో విషాదాన్ని నింపింది. శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు, ఆవిడ గురించి చాలా మందికి తెలియని నిజాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. 1951లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన ఆమె అసలు పేరు నేతి శ్యామల. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి పెంచుకున్న శ్యామల, కేవలం 13 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది సంవత్సరాలకే భర్త ప్రమాదంలో మరణించడంతో ఇద్దరు పిల్లల బాధ్యతను భుజాన వేసుకుని నటననే జీవనాధారంగా ఎంచుకున్నారు.
రంగస్థలంపై ఆమె నటనా ప్రస్థానం ‘దొంగాటకం’ నాటకంతో ప్రారంభమైంది. అనంతరం ప్రముఖ రచయిత గణేష్ పాత్రో రచించిన ‘పావలా’ నాటకంలో ఆమె నటనకు అపారమైన ప్రశంసలు లభించాయి. ఆ నాటకంలోని పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన శ్యామలను ప్రేక్షకులు ప్రేమగా ‘పావలా శ్యామల’ అని పిలవడం ప్రారంభించారు. ఆ పేరు తర్వాత ఆమె ఇంటి పేరుగానే స్థిరపడిపోయింది. రంగస్థలంపై తన హావభావాలు, సహజమైన సంభాషణలు, పాత్రలో పూర్తిగా లీనమయ్యే నటనతో పావలా శ్యామల ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. నాటకరంగంలో ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 1985లో జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె, అనంతరం స్వర్ణకమలం, ఖడ్గం, ఆంధ్రావాలా, వర్షం తదితర చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే జీవిత చరమాంకంలో అవకాశాలు తగ్గిపోవడం, అనారోగ్య సమస్యలు వెంటాడడంతో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పలువురు ప్రముఖులు ఆమెకు చేయూత అందించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. రంగస్థలంపై ‘పావలా’గా చిరస్థాయిగా నిలిచిపోయిన నేతి శ్యామల… తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఎప్పటికీ ‘పావలా శ్యామల’గానే గుర్తుండిపోతారు.
