Tumbbad 2: హిందీ చిత్రసీమలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆలియా భట్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’తో బిజీగా ఉన్న ఆమె, తదుపరి చిత్రం ఏదనే ఆసక్తికి తెరదించుతూ ‘తుంబాడ్ 2’లో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే హారర్ చిత్రాల అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సీక్వెల్‌లో ఆలియా చేరడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. 2018లో విడుదలైన ‘తుంబాడ్’ భారతీయ హారర్ చిత్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత 2024లో రీ రిలీజ్ అయినప్పుడు కూడా అద్భుతమైన స్పందనను అందుకుని, రీ రిలీజ్ విభాగంలో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ‘తుంబాడ్ 2’తో ప్రేక్షకులను మరో సారి భయపెట్టబోతున్నారు మేకర్స్.
ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ‘తుంబాడ్ 2’లో సోహమ్ షా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఇటీవల నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఆమె సుమారు 20 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆలియా భట్ ఎంట్రీతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా ఆలియా భట్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘తుంబాడ్’ను మొదటిసారి చూసినప్పటి నుంచి ఆ సినిమా తన మనసులో నిలిచిపోయిందని చెప్పారు. ఇలాంటి అద్భుతమైన సినిమాలో భాగం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు. ‘తుంబాడ్’లాంటి మర్మమైన కథలో కొత్త తరహా పాత్రను పోషించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.
ఆలియా చేరికపై సోహమ్ షా కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ తరం అత్యంత ప్రతిభావంతమైన నటీమణుల్లో ఆలియా ఒకరని ప్రశంసించిన ఆయన, ఈ చిత్రంలో ప్రేక్షకులు ఆమెను పూర్తిగా కొత్త కోణంలో చూడబోతున్నారని అన్నారు. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిన ఆమెతో తొలిసారి కలిసి పనిచేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ‘తుంబాడ్ 2’ విడుదల తేదీని కూడా చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ హారర్ థ్రిల్లర్‌ను ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని సోహుమ్ షా ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొలి భాగం కంటే ఈ సీక్వెల్ మరో లెవెల్ లో ఉండబోతుందని మేకర్స్ కూడా కుండ బద్ధలు కొట్టి చెబుతున్నారు. ఇప్పుడు ఆలియా భట్ చేరికతో ‘తుంబాడ్ 2’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారర్ చిత్రాల్లో ఒకటిగా మారింది.
