టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి సోషల్ మీడియా వేదికగా, ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారని, అందుకోసం భారీ స్కెచ్ వేశారంటూ ఒక వార్త నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తమిళనాడులో స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన తరహాలోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆ ప్రచారం సారాంశం. ‘ఊరువాడ’ అనే పేరుతో ఏకంగా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో పేదలు, వెనుకబడిన వర్గాల కోసం భారీ సేవా కార్యక్రమాలను తారక్ ప్లాన్ చేశారని.. ఈ విషయమై క్లారిటీ ఇచ్చేందుకు ఈ నెల 18న తిరుపతిలోని ప్రముఖ తాజ్ హోటల్‌లో ఎన్టీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
తారక్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఈ వార్తలపై ఎన్టీఆర్ అభిమాన సంఘాలు తక్షణమే స్పందించాయి. ఈ ప్రచారాలన్నింటినీ వారు తీవ్రంగా ఖండించారు. ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తారక్ చేపట్టే సేవా కార్యక్రమాలు కేవలం పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమేనని.. దానికి, తారక్ పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదని అభిమాన సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ అంశంపై ‘ఎన్టీవీ’ నేరుగా ఎన్టీఆర్ పీఆర్ టీమ్‌ను సంప్రదించి కన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేయగా అసలు నిజం బయటపడింది. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ వార్త కేవలం పుకారు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని పీఆర్ టీమ్ స్పష్టం చేసింది.
అంతేకాదు, గతంలో కూడా కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ పేరు చెప్పి సేవా కార్యక్రమాల నెపంతో డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినప్పుడు.. తారక్ టీమ్ అప్రమత్తమై అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ పేరుతో ఎవరూ డబ్బులు కలెక్ట్ చేయవద్దని, అలాంటి వాటికి తమకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లోనే ఘాటుగా స్పష్టం చేశారు. కాబట్టి, తాజా ప్రచారాలను కూడా నందమూరి అభిమానులు నమ్మవద్దని, అవన్నీ ఊహాగానాలేనని తేలిపోయింది. ప్రస్తుతం తారక్ తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టారు.
